సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్లో చలిగాలుల తీవ్రత ఎక్కువయ్యింది శీతాకాలం ప్రభావం ఏపీఎస్ఆర్టీసీపై కూడా పడింది. ప్రయాణికుల ప్రయాణాలు తగ్గాయి. దీంతో పలు రూట్లలో తిరిగే ఏసీ బస్సు సర్వీసులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.దీంతో ఆర్టీసీ నష్టాలను తగ్గించాలని ప్రయాణికులను ఆకర్షించేందుకు నెల రోజుల పాటు ఏసీ బస్సుల్లో ఛార్జీలను 10 నుంచి 20 శాతం తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఏ ఏ రూట్లలో ఏ బస్సుల్లో ఛార్జీలు తగ్గించాలనే నిర్ణయాన్ని జిల్లా ఇన్ చార్జీగా ఉన్న డీపీటీవోలకు అప్పగించింది. పలు రూట్లలో తిరిగే ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తూ ఆయా జిల్లాల డీపీటీవోలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు మధ్య నడిచే ఏసీ బస్సుల్లో చార్జీలను తగ్గిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆది, శుక్రవారాల్లో మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గిస్తున్నట్లు తెలిపారు. తగ్గించిన చార్జీలు డిసెంబర్ 1 నుంచి 31 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.ఉదాహరణకు విజయవాడ – బెంగళూరు వెన్నెల ఏసీ స్లీపర్ బస్సుల్లో చార్జీ రూ. 2,170 రూపాయల నుంచి రూ. 1,770 రూపాయలకు తగ్గించారు.
