సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ ఫిబ్రవరి 4 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్న అంతర్వేది లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. వేడుకలు చివరి అంకంలోకి ప్రవేశించాయి. నేడు సోమవారం మధ్యాహ్నం శ్రీలక్ష్మీనరసింహస్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొనగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా రథోత్సవం నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ మొగల్తూరు రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహదూర్ తొలిపూజ చేసి ఈ రథోత్సవాన్ని ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయం నుంచి శ్రీ స్వామి-అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై ఉంచి.. ఊరేగింపుగా స్వామివారిని తీసుకువచ్చారు. గోవింద, నరసింహ నామస్మరణలతో రథాన్ని వేలాది భక్తులు పోటీలు పడి మరి లాగారు.పోలీసులు శాంతి భద్రతా ఏర్పాట్లు చక్కగా నిర్వహించారు. ఇక రేపటి నుండి జరిగే స్వామివారి చక్రస్నానం, హంసవాహనంపై తెప్పోత్సవ కార్యక్రమాలకు పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
