సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో హెచ్‌పీ బంకు ఎదురుగా జాతీయ రహదారిపై స్కూటీపై వెళుతున్న రేషన్ డీలరు, చౌకడిపో డీలర్ల రాష్ట్ర నాయకుడు మద్దా జీవరత్నం (66)ను చేప పిల్లల ఐషర్ లారీ ఢీకొట్టడంతో మృతి చెందారు. ఐషర్ లారీ స్కూటీ వెనుక భాగం ఢీకొట్టడంతో ఆయన పక్కకు పడిపోయాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళగా వైద్యులు చనిపోయారని తెలిపారు. ప్రమాదం జరిగిన కంగారులో వ్యాన్‌డ్రైవర్ జాతీయ రహదారికి పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. స్తంభం విరిగి ఎస్‌ఎల్బీ హోమ్ మార్ట్ ఎదురుగా ఆగి ఉన్న రెండు మారుతి కార్లు, రెండు మోటారు సైకిళ్లుపై పడడంతో ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా రోడ్డ పక్కన ఉన్న మెకానిక్ షాపును ఈడ్చుకెళ్ళిపోయింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన వెంటనే ఫీజు యాంగిలర్ ఊడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆకివీడులో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. ఎస్‌ఐ బత్తిన నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
