సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఇజ్రాయిల్ దేశంపై రాకెట్ లాంచర్లు తో ఆకస్మిక ఆక్రమణ జరిపి తదుపరి మధ్య ప్రాచ్యంలో తీవ్ర యుద్ధ పరిణామాలలో ఇరు వైపులా వేలాది మంది ప్రజల మరణానికి కారణమైన హమాస్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్ (Yahya Sinwar)ను ఎట్టకేలకు గత గురువారం సాయంత్రం ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయి. ఇద్దరు అనుచరులతో పాటు సిన్వర్ మృతదేహాన్ని గాజాలోని ఒక శిధిల భవనం శకలాలలో ఇజ్రాయిల్ స్యైన్యం కనుగొంది. డీఎన్ ఏ పరీక్షల తరువాత అతని మరణాన్ని ధ్రువీకరించారు. ఇజ్రాయెల్ (Israel)లో గతేడాది అక్టోబర్ ఏడో తేదీన జరిగిన నరమేథానికి కీలక సూత్రధారి అయిన సిన్వర్ గురించి ఇజ్రాయెల్ తీవ్రంగా గాలిస్తోంది. ఇజ్రాయెల్‌లో 2023 అక్టోబర్ ఏడో తేదీన 1,200 మందిని చంపి, 250 మందికి పైగా బందీలుగా పట్టుకున్న హమాస్ (Hamas) దళాలకు మార్గదర్శకత్వం చేసిన వ్యక్తి సిన్వర్.`1962లో దక్షిణ గాజా (Gaza)లోని ఖాన్ యూనిస్‌లోని శరణార్థి శిబిరంలో యహ్వా సిన్వర్ జన్మించాడు. గాజా నుంచి ఇజ్రాయెల్ వాసులను తరిమేయాలని నిర్ణయించుకున్నాడు. గాజాలో హమాస్ గ్రూప్‌నకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగాడు. కానీ ఇజ్రాయెల్ సైన్యానికి పట్టుబడి ఏకంగా 22 ఏళ్ల పాటు ఇజ్రాయెల్ జైల్లో మగ్గిపోయాడు. 2011లో, గాజాలో కిడ్నాప్ అయిన ఒక ఇజ్రాయెల్ సైనికుడిని తిరిగి అప్పగించాలంటే తనతో సహా ఇజ్రాయెల్ కస్టడీలో ఉన్న 1,027 మంది ఖైదీలను వదిలిపెట్టాలని డిమాండ్ చేశాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత సిన్వర్ ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది పాలస్తీనియన్లను చిత్రహింసలకు గురిచేసి చంపేశాడుఅని ప్రచారం ఉంది. ఎట్టకేలకు అతనిని చంపి ఇజ్రాయిల్ శపధం నెరవేర్చుకొంది.
