సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతల చేరికలపై టీడీపీలో రాష్ట్ర వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏలూరు మేయర్ నూర్జహాన్ తో సహా వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ పోతుల సునీత అధికార పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం నిర్ణయాలపై టీడీపీ నాయకులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలాస తెలుగుదేశం ఎమ్మెల్యే గౌతు శిరీష సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను చేర్చుకోవద్దని టీడీపీ పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. కేవలం అధికారం పరమావధిగా ఊసరవెల్లి లాంటి నాయకుల్ని మన పార్టీలోకి తీసుకోవద్దు. వారికీ పదవులు ప్రాధాన్యత ఇవ్వొద్దు. గతంలో మనకు జరిగిన అనుభవాలు చాలు.. అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్లని పార్టీలో తీసుకుంటే, అధికారం లేనప్పుడు మన పార్టీ కోసం నిజాయితీగా నిలబడి పోరాడిన వాళ్లని అవమానించినట్టేనని ఆమె అన్నారు. దీనిని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకోని వెళతాను అన్నారు.
