సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏలూరులో అప్పు అడిగిన మహిళ ఆర్థిక అవసరాలు ఆసరాగా కిడ్నీ రాకెట్ ముఠా చేసిన దారుణ మోసం తాజగా వెలుగులోకి వచ్చింది. . ఏలూరు బెనర్జీపేట సితార హోటల్ సమీపం లో నివాసం ఉంటున్న బూసి అనురాధ (30)కు సుబ్బారావుతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అనురాధ కూరగాయల వ్యాపారం చేస్తుండేది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో సుబ్బారావు ఆమెను విడిచి వెళ్లిపోయాడు.తన కుటుంబానికి పరిచయమైన వాకచర్ల శరత్‌కుమార్‌ను 2021లో ఎవరైనా తక్కువ వడ్డీకి అప్పు ఇస్తారేమో చెప్పండి? అని ఆమె కోరింది. అతనికి తెలిసిన కె.ప్రసాద్ (మినీ ట్రాన్స్‌ఫోర్టు డ్రైవర్) లక్షల రూపాయలు అప్పులు ఇప్పిస్తుంటాడని శరత్ కుమార్ పరిచయం చేశాడు. ప్రసాద్ ఆమెకు మాయమాటలు చెప్పి 7 లక్షలు ఇప్పిస్తానని డబ్బు ఆశ చూపించి మూడు నెలల వ్యవధిలో ఆమె కిడ్నీని మరో వ్యక్తికి మార్పిడి చేయించారు. ఐతే విడతలుగా కేవలం 5 లక్షలు మాత్రేమే ఆమె చేతికిచ్చి కిడ్నీని స్వీకరించిన వ్యక్తి ఆమె భర్తగా తప్పుడు ఆధార్ కార్డులను కూడా మార్చేశారు. బాధితురాలు ప్రస్తుతం అనారోగ్యంతో ఉంది. జగనన్న ఇంటికి దరఖాస్తు చేసుకుంది. మరో వైపు కిడ్నీ లేని కారణంగా పెన్షన్‌కు దరఖాస్తు చేసుకుంది. సచివాలయం సిబ్బంది పరిశీలించి ఆమె పేరు బూసి అనురాధ కాదని ఇంటిపేరు యర్రంశెట్టి అనురాధ అని, భర్త పేరు యర్రంశెట్టి ఉదయ్‌కిరణ్ అని ఆన్‌లైన్‌లో ఉందనడంతో అవాక్కయింది. తనను మోసం చేసి తన కిడ్నీ తీసుకున్నారని ప్రసాద్, ఉదయ్‌కిరణ్‌పై ఏలూరు వన్‌టౌన్ పోలీసులకు గత గురువారం ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ బోణం ఆది ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
