సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు రేంజ్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) గోరంట్ల వెంకట గిరి అశోక్‌కుమార్‌కు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా.. ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారులలో 9 మందికి ఐజీలుగా పదోన్నతి కల్పించారు. 2024 జనవరి 1వ తేదీ నుంచి వారు ఐజీలుగా ఉద్యోగ బాధ్యతలను చేపడతారని ఆ ఉత్తర్వుల్లో ప్రకటించారు. కర్నూలు జిల్లాకు చెందిన డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ తండ్రి డాక్టర్ సూర్యనారాయణరావు సివిల్ సర్జన్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అశోక్‌కుమార్ బి.టెక్ (సివిల్), ఎం.ఇ. (స్ట్రక్చర్స్) చదివారు. 1996లో డీఎస్పీగా పోలీస్ శాఖలో ఆయన విధుల్లో చేరారు. అనంతరం వివిధ హోదాల్లో పనిచేస్తూ 2019లో డీఐజీగా పదోన్నతి పొందారు. విజయవాడలోని ఏసీబీలో రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ అండ్ అడిషన్ డైరెక్టర్‌గా 2019 నవంబరు నుంచి 2023 ఏప్రియల్ వరకు పని చేశారు. అనంతరం 2023 ఏప్రిల్ 12న ఏలూరు రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టిన డీఐజీ అశోక్‌కుమార్ ఏలూరు రేంజ్ పరిధిలో శాంతి భద్రతలను కాపాడడంలో తనదైన శైలిలో వ్యవహరించారు. 2018లో ఇండియన్ పోలీస్ మెడల్ (విశిష్ట సేవలు)ను భారత ప్రభుత్వం అందించింది.
