సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం నుండి అతను తీసుకొంటున్న పలు ఆర్ధిక నిర్ణయాలతో ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. కొలంబియా-అమెరికా మధ్య ఉద్రిక్తతలు సూచీలను నిలువునా ముంచేస్తున్నాయి. ఆ ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్లపై కూడా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు భారీగా పతనమవుతున్నాయి. దీంతో నేడు, సోమవారం ఒక్కరోజే దేశీయ సూచీలు రూ.8 లక్షల కోట్ల నష్టపోయాయి. నిఫ్టీ మళ్లీ 22, 900 వేల దిగువకు పడిపోయింది. (Business News). గత శుక్రవారం ముగింపు (76, 190)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 500 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. నష్టపోయిన సెన్సెక్స్ 75, 267 వద్ద కనిష్టానికి చేరుకుంది. చివరకు 824 పాయింట్ల నష్టంతో 75, 366 వద్ద రోజును ముగించింది. బ్యాంకింగ్ రంగం తప్ప దాదాపు అన్ని రంగాలు నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, టొరెంట్ ఫార్మా, ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలను ఆర్జించాయి. లారస్ ల్యాబ్స్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, పిరామిల్ ఎంటర్‌ప్రైజెస్, సీడీఎస్‌ఎల్ షేర్లు భారీగా నష్టపోయాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.34గా పతనం అయ్యింది.
