సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అనంతపురం జిల్లా లో ప్యాక్షన్ రాజకీయాలకు కీలకమైన తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఏదైనా అసాంఘిక శక్తుల నుండి ఒత్తిళ్ల? లేక కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే నేడు, సోమవారం ఉదయం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తాడిపత్రికి చేరుకుని ఆనందరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. సీఐ ఆనందరావు కుటుంబంలో కలహాలు ఉన్నాయని తెలిపారు. నిన్న రాత్రి గొడవ జరిగిందన్నారు. ఎలాంటి పని ఒత్తిడి లేదని.. కేవలం కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.అయితే సీఐ ఆనందరావు పెద్ద కూతురు భవ్య వర్షన్ ఉంది. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేవలం పని ఒత్తిడితోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. తాడిపత్రిలో వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉందని హ్యాండిల్ చేయలేకపోతున్నానంటూ తరచూ తన తండ్రి బాధపడ్డారని భవ్య తెలిపారు.
