సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లోనే నివాసం ఉండి తనదయిన శైలిలో ఏపీలో రాజకీయాలు నడిపి విజయకేతనం ఎగురవేసిన చంద్రబాబు .. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తన రెండు కళ్లు అని సీఎం నారా చంద్రబాబు మరోసారి వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవం వస్తుందని, ఇక్కడ కార్యకర్తలు, నేతల అభిమానం చూస్తుంటే ఎంతో ఉత్సాహం వస్తుందని పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేద్దామని తెలంగాణ క్యాడర్ నుద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌లో నేడు, ఆదివారం స్థానిక ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో విజయానికి తెలంగాణ పార్టీ శ్రేణులు ఎంతో కృషి చేశారని , గత ఏడాది తన అక్రమ అరెస్ట్ జరిగినప్పుడు తెలంగాణాలో టీడీపీ అభిమానులు చూపించిన ఆందోళనకు నిరసన కార్యక్రమాలలో చొరవ కు గర్వపడ్డానని అన్నారు. తన ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని ఎన్టీఆర్ భవన్‌కు వచ్చానన్నారు.
