సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గ్రామ పంచాయతీల గొంతును నొక్కేలా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయంటూ భీమవరంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బి. బలరాం విమర్శించారు. స్థానిక సుందరయ్య భవనంలో నేడు మంగళవారం ఆయన మీడియానుద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అందాల్సిన 14,15 వ ఆర్ధిక సంఘం నిధులైన 13వందల కోట్ల రూపాయల్ని వేరే పథకాలకు మళ్లించి గ్రామ పంచాయతీలకు మొండి చెయ్యి చూపిందన్నారు. దీని వలన గ్రామాల్లో చిన్నపాటి అభివృద్ధి పనులకు సైతం నిధులు లేక పంచాయతీలు విలవిల్లాడుతున్నాయన్నారు. గ్రామపంచాయతీలకు ఉన్న కొద్దిపాటి నిధుల్ని కూడా వాడేసుకోవడం అన్యాయమైన విషయమన్నారు. దీనివలన సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మిగులుతున్నారన్నారు. సొంత నిధులతో గ్రామాల్లో చేప్పట్టిన కొద్దిపాటి అభివృద్ధి పనులకు నిధులు విడుదల కాక ఏం చేయాలో తెలియాని స్థితిలో ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు, 14 ,15 వ ఆర్ధిక సంఘం నిధుల్ని కూడా వెంటనే విడుదల చేసి పంచాయతీలను ఆదుకోవాలన్నారు. చిన్న చిన్న పంచాయతీలు నేడు కరెంటు బిల్లులు కూడా కట్టలేని దుస్థితిలో ఉన్నాయన్నారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేసారు. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నామని చెపుతున్న ప్రభుత్వం ఈ విధంగా ఆర్ధిక ఇబ్బందులు పెట్టడం దారుణమన్నారు. పంచాయతీ సర్పంచులు చేస్తున్న ఆందోళనలకు సిపిఎం సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలియజేస్తుందన్నారు.
