సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు ఆర్‌ఐవో నేతృత్వంలో పరీక్షలు జరుగగా, ఈ ఏడాది నుంచి సమూల మార్పులు చేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత తొలిసారిగా కొత్తజిల్లాల ప్రాతిపదికన ఈ పరీక్షలను నిర్వహించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఆ ప్రకారం పరీక్షల నిర్వహణ మొదలుకుని సిబ్బంది నియామకాలు, పరీక్ష పేపర్లు దిద్దటం మార్కులు వెయ్యడం తదితర పనులన్నీ ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే జరుగుతాయి. ఫిబ్రవరి 2న ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, 3న ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ పరీక్షలతో ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. సైన్స్ సబ్జెక్టుల విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఒకేషనల్ విభాగంలో ఫిబ్రవరి 5 నుంచి, జనరల్ విభాగంలో 10 నుంచి జరుగుతాయి. ఈ ప్రాక్టికల్స్‌కు ఒకేషనల్ సబ్జెక్టుల్లో మొత్తం 4,501 మంది, జనరల్ విభాగంలో 9,909 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ప్రధాన పరీక్షలైన థియరీ పరీక్షలు మార్చి 1నుంచి 20 వరకు జరుగుతాయి. కాగా ప్రాక్టికల్ పరీక్షలకు ముందే విద్యార్థు లకు హాల్ టిక్కెట్లను అందజేయాలని నిర్ణయించారు.
