సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రజలకు మోయలేని భారంగా పరిణమించిన రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల పెంపు తక్షణమే ఉపసంసరించుకోవాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు జె.ఎన్.వి. గోపాలన్, ఫార్వార్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంక కృష్ణమూర్తి, సీపీఐ పట్టణ కార్యదర్శి చెల్లబోయిన రంగారావు,ఎంసీపీఐ జిల్లా నాయుకుడు కె.వి.వి.బ్రహ్మం కోరారు. విద్యుత్ భారాలు ఉపసంహరణ కోరుతూ వామపక్షాల రాష్ట్ర వ్యాపిత కార్యాచరణలో భాగంగా నేడు సోమవారం భీమవరంలో శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ కు వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ.. పెంచిన విద్యుత్ ఛార్జీలతో పాటు ట్రూఅఫ్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యుత్ భారాలు తొలగించాలని కోరుతూ ఈనెల 28, 30 తేదీల్లో విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద ధర్నాలు నిర్వహించి, సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభిస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే విద్యుత్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.
