సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్వర్గీయ బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతోత్సవంను పురస్కరించుకొని నేడు, శనివారం భీమవరంలోని కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ నందు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు పుష్పమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధునిగా పోరాడుతూనే సమ సమాజ నిర్మాణం కోసం కుల నిర్మూలన ఉద్యమాలు నడిపిన గొప్ప నాయకులుగా బాబూ జగ్జీవన్ రామ్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. కేంద్ర రక్షణ ,రైల్వే, వ్యవసాయ, రవాణా కమ్యూనికేషన్స్ తదితర శాఖల మంత్రిగా ,ఉప ప్రధానిగా తన జీవితకాలం దేశాభివృద్ధికి సామాజిక న్యాయం అందించడానికి ఎంతో కృషి చేశారన్నారు. జగజీవన్ రామ్ వంటి నాయకుల త్యాగాలు ఫలితంగా దేశ ప్రజలు వివిధ రంగాలలో నేడు ఎన్నో అవకాశాలను అందుకోగలుగుతున్నారన్నారు వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు చదువుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ భారతదేశ చరిత్రలో లేనివిధంగా సుమారు 30 సంవత్సరాలు కేంద్ర మంత్రులు గాను , ఉపప్రధానమంత్రిగా పనిచేయడం ఎంతో గర్వకారణం అన్నారు. వివిధ శాఖలను అలంకరించి ఆ శాఖలలో వినూత్న మార్పులు తీసుకొచ్చి తనదైన ముద్రను వేశారన్నారు.
