సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: లోని తెలుగు పాట ‘నాటు నాటు’ ప్రపంచం లో ప్రతిష్టాకరంగా భావించే ఆస్కార్ అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఒక తెలుగు పాట ఇలా ఆస్కార్ గెలుచుకోవటం ఇదే మొదటిసారి. భారత దేశానికి చెందిన వారు ఎంతమంది ఆస్కార్ గెలుచుకున్నారు అంటే వేళ్ళ మీద లెక్కించవచ్చు. అలాంటిది ఒక తెలుగు సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’ లోని ఈ పాటకి ఆస్కార్ రావటం భారత దేశానికే గర్వ కారణం. గతంలో బాహుబలి సిరీస్ తో తెలుగుసినిమా సత్తా ప్రపంచానికి చాటిన దర్శకుడు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్. తో ఆస్కార్ (Oscars95) అవార్డు సాధించి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల దృష్టిని ఆకర్షించారు. ‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ అకాడమీ అవార్డ్ వచ్చింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయం లో ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో ఈ అవార్డు ఈ పాటకి ఇస్తున్నట్టుగా ఆస్కార్ వేదిక మీద ప్రకటించారు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా దర్శకుడు రాజమౌళి కాగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. చంద్రబోస్ ఈ ‘నాటు నాటు’ పాటని రాశారు. ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకి అద్భుతమైన కోరియోగ్రఫీ చేశారు. దానికి తగ్గట్టు ఎన్టీఆర్, రాంచరణ్ అదరగొట్టేసారు. వీరందరి సమిష్టి కృషి అద్భుతం చేసింది. . ఇది తెలుగువాడి విజయం, ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజు ఈరోజు.
