సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడిద్దాం..దేశాన్ని కాపాడుకుందాం, అనే నినాదంతో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా వామపక్ష, లౌకిక శక్తులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని స్థానిక సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో భీమవరం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నేడు, బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తులు ప్రాణాలర్పించి దేశానికి తీసుకొచ్చిన స్వాతంత్ర్యాన్ని , మనం సమకూర్చుకున్న రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్, జనసంఘీయులు ఒప్పుకోవడంలేదని విమర్శించారు. బిజెపి పాలకులు గత పదేళ్లుగా రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తున్నారు, మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తే దేశంలో నియంతృత్వం పెరిగిపోతుందని, దేశాన్ని, కాపాడాలంటే బిజెపిని ఓడించక తప్పదని ఆయన పిలుపునిచ్చారు.. దేశంలో విపక్షాలను దారిలోకి తేవడానికి సిబిఐ, ఐటి, ఇడిలను అడ్డంపెట్టుకుని భయబ్రాంతులకు గురిచేయడం దారుణమని ,రేపో మాపో స్టాలిన్, మమతలు అరెస్టు అవుతారని, ఇప్పటికే కేజ్రీవాల్, సోరెన్, కవిత అరెస్టయ్యారని ఇది ఇంతటితో ఆగదని కోనాల నిప్పులు చెరిగారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్వీ గోపాలన్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని రాజ్యాంగం అంటే రిజర్వేషన్లు కాదని, ఎస్సీ ఎస్టీ బీసీ లది కాదని నవ భారత నిర్మాణానికి దేశానికి దిశ దశ నిర్దేశం రాజ్యాంగం అన్నారు. చివరకు ఎలక్షన్ కమిషన్, న్యాయమూర్తుల నియామకంలో సైతం బిజెపి కనుసన్నల్లో జరగడం దారుణమని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను చేతుల్లోకి తీసుకుని 11 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కుప్పకూల్చేశారని గోపాలన్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు తమలంపూడి వంశీ, ఫార్వర్డ్ బ్లాక్ భీమవరం డివిజన్ కార్యదర్శి దండు శ్రీనివాసరాజు, ముస్లిం జెఏసి భీమవరం పట్టణ అధ్యక్షులు సిద్ధిఖీ, ముస్లిం మైనారిటీ నాయకులు ఛాన్ భాషా తదితరులు మాట్లాడారు.నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి ఓటమికి తీవ్ర కృషి నిర్వహించాలని సమావేశం తీర్మానించింది.
