సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం గురు పౌర్ణమి, ఆషాడ పౌర్ణమి నేపథ్యంలో భీమవరం పట్టణంలో పంచా రామ క్షేత్రం, శ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయాలతో పాటు అన్ని సాయి బాబా దేవాలయాలలో ప్రత్యక పూజలు అభిషేకాలు , అన్నసమారాధనలు నిర్వహిస్తున్నారు. భీమవరం శివారు లోని పెదమిరం లో స్వర్ణ సాయి మందిరంలో భారీ స్థాయిలో గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. నేటి ఉదయం 7గంటల నుండి 11న్నర్ర సమయం వరకు సుమారు 10వేల మంది సాయి భక్తులు హాజరు అయ్యి క్యూ లైన్లలో నిలబడి బాబా వారికీ స్వయంగా పంచ ద్రవ్యాలతో, ఆవుపాలచే భక్తులచే సాయి విగ్రహానికి అభిషేకాలు నిర్వహించారు.ప్రతి ఏడాది లానే దాతల సహకారంతో ఉచితంగా ఈ అభిషేకం ఏర్పాటు చేసారు.నేటి మధ్యాహ్నం కేరళ నుండి వచ్చి 3దశాబ్దాలుగా భీమవరంలో స్థిరపడ్డ పళని అప్పన్ దంపతులు శ్రీ స్వర్ణ సాయి బాబా వారికీ ‘బంగారు కిరీటం’ కానుకగా సమర్పించి దానిని ఆయనకు అలంకరించడం గొప్ప వేడుకగా జరిగింది. ( ఫై చిత్రంలో ) మహారాష్ట్ర లోని షిరిడీ దేవాలయానికి దీటుగా ఇక్కడ తీన్మార్ డప్పుల వాయిద్యాలు, యాగాలు హారతి సేవలు,పల్లకి సేవలు, రధ యాత్రలు వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నేటి రాత్రి 10 గంటల వరకు కొనసాగిస్తున్నారు. నేటి ఉదయం 8గంటల నుండి పంచ బక్ష పరమణలతో దాతల సహకారంతో వేలాది భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఇక్కడికి 7 కిమీ దూరంలో ఉన్న సీసలి గ్రామంలోని శ్రీ షిరిడి సాయి దేవాలయంలో కూడా ఇదే రీతిన వేలాది భక్తుల కోలాహలం నడుమ గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జేపీ రోడ్డు లోని గురుదత్త అష్టలక్ష్మి ఆలయంలో, శ్రీరామపురంలోని శ్రీ సత్యసాయి సేవ ట్రస్ట్ మందిరంలో నేటి సాయంత్రం 6 గంటలకు ప్రవచనాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
