సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పరిసర ప్రాంతాలలో అన్ని శివాలయాలు నేటి శుక్రవారం తెల్లవారు జామునుండి ఓం శివోహం’ అంటూ భక్త సంద్రం తో నిండిపోయాయి. ఇక పురాణ ప్రాశస్యంతో సాక్షాత్తు చంద్రుడు ప్రతిష్టించాడని భావించే పవిత్ర పంచా రామం గునుపూడి సోమారామం అయితే అందమైన పుష్ప అలంకరణలుతో కన్నులకు కైలాసం తలపించే లైటింగ్ కాంతులతో, చలువ పందిళ్ళతో ఆధ్యాత్మిక శోభ తో సందడిగా ఉంది. శ్రీ సోమేశ్వరుని దర్శనం కోసం గత అర్ధరాత్రి నుండి భక్తులు భారీ క్యూ లైన్ లలో నిలబడి పోవడం జరిగింది. అయితే దర్శనాలు తెల్లవారు జాము 2న్నర గంటలకు ప్రారంభించారు. వేలాది గా భక్తులు తరలి రావడంతో తగిన పోలీసులు , స్వచ్చంద కార్యకర్తలు తగిన ఏర్పాట్లు చేసారు. భక్తులు కోసం దాతల సహకారంతో ప్రసాద వితరణ, మంచినీరు ఏర్పాట్లు చక్కగా చేసారు. నేటి ఉదయం 11 గంటల వరకు భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. ప్రత్యేక క్యూ లైన్ ల ద్వారా వేగంగా భక్తులు శివదర్శనం చేసుకొంటున్నారు. పోలిసుల సహకారంతో దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు, కార్యనిర్వాహణ అధికారి రామకృష్ణంరాజు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రేపు 9వ తేదీ మధ్యాహ్నం 4 గంటలనుండి రధోత్సవం 10 వ తేదీ రాత్రి 7 గంటల నుండి తెప్పోత్సవం నిర్వహించనున్నారు. స్థానిక 1200 ఏళ్ళ క్రితం నిర్మించిన పురాతన శ్రీ భీమేశ్వర స్వామి గుడిలో, సమీపంలోని యనమదురులోని స్వయం భూ శ్రీ శక్తేశ్వర స్వామి, పెద్దమిరం లో శ్రీ ఆదిశంకరాచార్యుని చే ప్రతిష్ఠిత లింగంగా భావించే శివాలయం ( జైన గుడి వెనుక) వేలాదిగా భారీ క్యూ లైన్లలో నిలబడి శ్రీ పార్వతి సమేత శ్రీ పరమేశ్వరుని దర్శించు కొంటున్నారు.
