సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కేవలం విద్యార్థి సంఘం మాత్రమే కాదని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంతో పాటు సమాజంలో సమూల మార్పుకు కృషి చేస్తున్న గొప్ప సంస్థ అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో భీమవరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో రెండు రోజుల పాటు జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిన్న ఆదివారం నేడు, సోమవారం జరుగుతున్నాయి. తొలి రోజు ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు నూజిల్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస వర్మ ఏబీవీపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో ‘రెండో బార్డోలి’గా పిలవబడిన చారిత్రక పట్టణం భీమవరంలో సమావేశాలు జరగడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి దశలో సంఘ శాఖకు వెళ్లేవాడినని కానీ ఏబీవీపీలో పనిచేయలేకపోయాననే బాధ తన జీవితంలో ఇప్పటికీ వెంటాడుతొందని శ్రీనివాస వర్మ అన్నారు. దేశంలో ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ఏబీవీపీ కార్యకర్తలు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని ప్రశంసించారు. ఈ సమావేశాల్లో అఖిలభారత సహా సంఘటన మంత్రి బాలకృష్ణ, జాతీయ కార్యదర్శి శ్రావణ బి రాజ్, దక్షిణ మధ్య క్షేత్రల సంఘటన మంత్రి శివ కుమార్, బీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి, మురళీ కృష్ణంరాజు, జ్వాలా శ్రీనివాస్, కలిదిండి వినోద్ వర్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
