సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోస్టల్ ఆంధ్ర లో మరో విజయవాడ తరహా అన్ని వసతులు ఉన్న కాస్మో లుక్ నగరంగా గ్రామీణ వాతావరణం కలగలుపుగా ఉన్న పట్టణంగా కనపడే భీమవరంలో మూడున్నర దశాబ్దాల తర్వాత కొత్త మాస్టర్ ప్లాన్ అమలు కాబోతోంది. 2019లో చేపట్టిన మాస్టర్ ప్లాన్ డ్రాప్టును ఎట్టకేలకు ఈనెల 21న ఏలూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ ద్వారా డ్రాప్టును విడుదల చేశారు. దీనిపై ప్రజలనుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు నెల రోజులు గడువు ఇచ్చారు. జిల్లా కేంద్రంగా కూడా మారటంతో భీమవరం పట్టణంలో మునిసిపాలిటీలో గతంలో విలీనం చేసిన తాడేరు, రాయలం, చిన అమిరం, కొవ్వాడ అన్నవరం గ్రామాలను కలుపుతూ నూతన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. గతంలో 26.48 చదరపు కిలోమీటర్లు పట్టణ విస్తీర్ణం ఉండగా కొత్తగా 48.98 చదరపు కిలో మీటర్లకు విస్తరించింది. డ్రాప్టు మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన మ్యాప్‌ను మునిసిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో అందుబాటులో ఉంచారు. స్థానికులు కార్యాలయాల పనివేళల్లో పరిశీలించుకోవచ్చు. అదేవిధంగా మ్యాప్‌లను కలెక్టర్ కార్యాలయం, ఎంపీడీవో, సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. కొత్తమాస్టర్ ప్లాన్ రూపొందించే సమయంలో 2020–21లో అప్పట్లో పట్టణంలోని ప్రముఖుల, ఛాంబర్ ఆఫ్ కామర్సు, ఎన్‌జీవోలు తదితరులతో నిర్వహించిన సమావేశంలో సుమారు 50 సూచనలు చేసారు. వాటిలో 90 శాతం వరకు డ్రాప్ట్ మాస్టర్ ప్లాన్‌లో పరిష్కారం చూపారు. డ్రాప్టు మాస్టర్ ప్లాన్‌లో ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్లు, కనెక్ట్‌విటీ రోడ్లను ప్రతిపాదించారు. అదే విధంగా నేషనల్ హైవే 165 మాస్టర్ ప్లాన్‌లో చూపించారు. ఇది విస్సాకోడేరు మీదుగా వెళ్లేలా చూపించారు. నరసాపురం–భీమవరం తాడేరు వైపు రోడ్డును 40 అడుగుల నుంచి 60 అడుగులకు పెంచాలని ప్రతిపాదించారు.
