సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం శివారు గ్రామాల్లో ఇక విద్యుత్ ఓల్టేజ్ సమస్యలు ప్రజలకు ఉండవని, వాటి పరిష్కారానికే 33/11కేవీ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం మండలం లోసరి గ్రామంలో రూ 3 కోట్ల 15 లక్షలతో 33/11కేవీ సబ్ స్టేషన్ కు ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. ఈ ఉప కేంద్రంతో లో వొల్టేజి సమస్య నిర్మూలన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతాయని, బర్రివానిపేట, దొంగపిండి, గరివిడిదిబ్బ, గూట్లపాడు, కొత్త పూసలమర్రు, లోసరి, తోకతిప్ప, నాగేంద్రపురం, నాగిడిపాలెం గ్రామాలు ఎంతో లబ్ధి పొందుతాయని అన్నారు. 3830 గృహ విద్యుత్ వినియోగదారులు, 242 వాణిజ్య విద్యుత్ వినియోగదారులు, 86 వీధి లైట్లు, రక్షిత మంచినీటి పథకం స్కూల్స్, వివిద దేవాలయాలు, 345 వ్యవసాయ ఆక్వా కనెక్షన్లు, 1 హై టెన్సన్ పరిశ్రమలకు ఈ ఉప కేంద్రం ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు, ఎలక్ట్రికల్ అధికారులు పాల్గొన్నారు.
