సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుదీర్ఘ కాలంగా జరుగుతున్నా స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు నేడు, మంగళవారం తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసింది.సుప్రీం కోర్టులో జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణకు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. తన తండ్రి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సునీత దాఖలు చేసిన పిటిషన్పై అక్టోబర్ 19న జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం విచారణ ముగించింది. ఈ క్రమంలోనే నేడు కడప సీబీఐ కోర్టు నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. వివేకా కుమార్తె, భార్యకు ఏపీ రాష్ట్రంలో కేసు విచారణపై అనేక అనుమానాలు ఉన్నందున వారి కోరిక మేరకు బదిలీకి ఆదేశాలిస్తున్నట్టు సుప్రీం తెలిపింది. ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసులో సాక్ష్యాలను చెరిపేసిన ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలాంటి అనుమానాలకు ఆస్కారం వచ్చే పరిస్థితి రావడం దురదృష్టకరమంటూ సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించింది.
