సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ అనుమానస్పదంగా మృతిచెందడం తీవ్ర సంచలనంగా మారింది. కాకినాడలో పనిచేస్తున్న యువకుడు శ్యామ్ అమ్మమ్మ ఊరు అయిన కొత్తపేట మండలం మోడేకుర్రుకు వారం రోజుల క్రితం వచ్చి ఈ నెల 25న అనుమానస్పదంగా మృతిచెందాడు. మణికట్టుపై బ్లేడ్‌తో సుమారు 100 సార్లు కోసుకున్నట్లు, ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం కనిపించింది. ఇప్పటికే పోలీసులు ప్రేమ విఫలమై ఆత్మహత్య గా భావిస్తున్నప్పటికీ హత్య చేసి ఉంటారని భావిస్తున్న కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు అనుమానస్పద కేసుగా నమోదుచేసి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఎన్టీఆర్ అభిమానిగా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉన్న శ్యామ్ మరణంపై తాజాగా నేడు, మంగళవారం జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో, ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచివేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.
