సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని ఓ స్కూల్లో చదువుకుంటున్నాడు. పాఠశాలలో నేడు, మంగళవారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మార్క్ శంకర్ తో పాటు పలువురు విద్యార్థులు చిక్కుకున్నారు. బాబుకు చేతులు, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి.అయితే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులకు గురయ్యాడు. మార్క్ శంకర్‌కు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన పవన్ కల్యాణ్ కు విశాఖపట్నం నుంచి సింగపూర్ వెళ్లేందుకు అధికారులు ప్రత్యేక విమానం ఏర్పాట్లు చేశారు. పవన్ కల్యాణ్‌తో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా సింగపూర్ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. సింగపూర్ వైద్యులతో పవన్ కల్యాణ్, చంద్రబాబు , లోకేష్ మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సింగపూర్ వైద్యులు తెలిపారని సమాచారం.
