సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్‌ను(కేంద్ర బడ్జెట్ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై భారతదేశ ప్రజలు విశ్వాసంతో ఉన్నారంటూ ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు… ఈసారి దేశంలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం అందించాలని లక్ష్యంగా .. ఉపాధి, నైపుణ్య శిక్షణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, మధ్యతరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తూ.. ఉన్నత చదువుల కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీలను బడ్జెట్‌లో ప్రకటించారు. వ్యవసాయంలో ఉత్పాదకత, స్థితిస్థాపకత, ఉపాధి, నైపుణ్యం, తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం, పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించారు. ఈసారి బడ్జెట్ లో బిహార్‌కు ప్రత్యేక హోదా లేదు కానీ..భారీ కేటాయింపులు చేసారు. ఏపీ ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొన్నారు. వార్షిక ఆదాయం పైన కొత్త పన్నుల శ్లాబులు ప్రకారం.. సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను సున్నా.. రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్ను.. రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను.. రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను.. రూ.15 లక్షల వార్షిక ఆదాయం పైన 30 శాతం పన్ను విధించారు. పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లుగా, అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు అంచనావేశారు. కేంద్రబడ్జెట్‌లో ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో మొబైల్ ఫోన్లు, ఛార్జర్ల ధరలు తగ్గనున్నాయి.మహిళలకు బంగారం, వెండితో చేసిన ఆభరణాల ధరలు తగ్గనున్నాయి. తోలుతో చేసిన సామాగ్రి ధరలు తగ్గనున్నాయి. క్యాన్సర్‌కు సంబంధించిన మూడు రకాల ఔషధాలను కస్టమ్ డ్యూటీ ఫ్రీగా ప్రకటించారు. దీంతో మూడు రకాల ఔషధాలు తక్కువ ధరకు లభించనున్నాయి.
