సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో నేడు, సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న షైనింగ్ స్టార్స్ -25 ప్రతిభా పురస్కారాలను 153 మంది పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు రూ 30 లక్షల 60 వేలను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధులుగా ఎంపీ పాక సత్యనారాయణ, ఎమ్మెల్యే అంజిబాబు, జిల్లా కలెక్టర్ నాగరాణి, పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ నేడు సమాజం అభివృద్ధిలో వెనుకబాటుతనానికి కారణం అందరూ విద్యను అభ్యసించకపోవడమేనని, అందరూ విద్యావంతులైతేనే సమాజం అభివృద్ధి పథంలో ఉంటుందన్నారు. జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోవాలంటే విద్య ముఖ్యమైన సాధనమని, అటువంటి విద్యను విద్యార్థులు ఏ విధమైన ఆటంకాలు లేకుండా అందుకోవటంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైనదన్నారు. రాజ్య సభ సభ్యులు పాక సత్యనారాయణ మరియు ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల, కళాశాలలోని విద్యార్థులు షైనింగ్ స్టార్స్-25 పురస్కారాలను అందుకోవడం గొప్ప విశేషమని అన్నారు. ఒక్కొక్కరికి రూ 20 వేలు చొప్పున పదో తరగతి 119 మంది విద్యార్థులకు రూ 23 లక్షల 80 వేలు, జూనియర్ కళాశాలలో 34 మంది విద్యార్థులకు రూ 6 లక్షల 80 వేలు అందిస్తున్నామని అన్నారు. కార్పొరేట్ స్కూల్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య బోధన సాగుతుందని అన్నారు. అనంతరం 153 మంది పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ – 25 ప్రతిభ పురస్కారాలను అందించారు. కార్యక్రమంలో డీఈవో నారాయణ, విద్యాశాఖ అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.
