సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు నేడు, శుక్రవారం మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఫై అసహనం వ్యక్తం చేసారు. ఉద్యోగులకు సంక్రాంతి నాటికి బకాయిలు చెల్లిస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చిందని.. ఇంతవరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ (CPS) వాటా డబ్బులు ప్రభుత్వం వాడేసుకుందని ఆరోపించారు. ‘జీతాలు మాకు భిక్ష వేస్తున్నారా?’ అంటూ ప్రశ్నించారు. ప్రతి నెల చివరి రోజు జీతాలు ఇవ్వాలని చట్టం ఉందని, కానీ 12 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు నిర్ణయించిన తేదికి ఇవ్వలేక ఆలస్యంగా జీతాలు ఇస్తున్నారని, ఇక సమయానికి ఉద్యోగ పెన్షన్లు ఇవ్వకపోతే ఎవరు సిగ్గు పడాలని బొప్పరాజు ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యల పట్ల సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చారు కానీ పూర్తి జీతాలు ఇవ్వడం లేదని విమర్శించారు. జీతాలు పూర్తి స్కేల్ ఇవ్వాల్సి వస్తుందని క్రమబద్దీకరణ చేయకపోవడం దారుణమన్నారు. ఉద్యోగులను గాలికి వదిలేశారని, ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని అన్నారు. ఈ నెల 26న సమావేశంలో తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *