సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: నిజానికి ఎన్ని అధునాతన టెకనాలజి తో ఆధునిక వస్త్రాలు, దుస్తులు వైరైటీ డీజైన్లలో వస్తున్నా.. మనిషి కి ఏ కాలంలోనైనా సౌకర్యం, ఆరోగ్యం కలిగించేవి చేనేత వస్త్రాలు మాత్రమే.. అయితే ఇకపై చేనేత వస్త్రాలు ను కూడాఆధునికంగా మార్కెట్ చెయ్యడానికి తాజాగా ఏపీ ప్రభుత్వ రంగ సంస్థ, ఆప్కో తొలిసారి ర్యాంప్ వాక్ కు శ్రీకారం చుట్టింది. సరికొత్త డిజైన్లతో కూడిన చేనేత వస్త్రశ్రేణితో పడతులు చేసిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. విజయవాడ ఆప్కో మెగా షోరూమ్‌లో నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. సంక్రాంతి సంబరాలను ముందుగానే ఆప్కో ఆవిష్కరించింది. చీరాల, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి తదితర ప్రాంతాలకు చెందిన వందలాది డిజైన్ల వ్రస్తాలతో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది.చేనేత వ్రస్తాలంటే వయోజనులు, వృద్ధులకే అన్న నానుడిని తుడిచివేస్తూ ర్యాంప్ వాక్ సాగింది. ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, ఎండీ చదలవాడ నాగరాణి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రదర్శనను ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన అన్నిరకాల చేనేత వ్రస్తాలను ఫ్యాషన్ షోలో ప్రదర్శించారు. మోడల్స్‌తో పాటు చేనేత వస్త్రాలను అమితంగా ఇష్టపడే యువతులు సైతం స్వచ్ఛందంగా ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నారు. కండువాల నుంచి పంచెలు, చీరల వరకు ప్రదర్శించారు.
