సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : పశ్చిమ గోదావరి జిల్లాలో భక్తులు అత్యధిక హుండీ ఆదాయం ఇతరాత్ర కానుకలు సమర్పించే ఆలయాలలో భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవస్థానం అగ్రస్థానంలో ఉంటుంది. సంక్రాంతి నుండి ఇక్కడ వైభవంగా జరిగే 30 రోజుల ఉత్సవాలు గురించి తెలియని తెలుగువారు ఉండరు. తిరుమల వెంకన్న తరహాలో నిలువెత్తు మూలవిరాట్, శ్రీఅమ్మ వారి తలపై బంగారు వజ్ర కిరీటం కూడా లోక ప్రసిద్ధి పొందింది. తన భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని నిలువెత్తు స్వర్ణమయ ఆభరణాలతో చూడాలని సుదీర్ఘకాలంగా ఉన్న భక్తుల కోరిక ఇప్పటికే 70శాతం పైగా నెరవేర్చుకొన్నారు. శ్రీ అమ్మవారికి బంగారు చీర తో సహా మొత్తం 100 కిలోల స్వర్ణంతో సకల స్వర్ణాభరణాలను సిద్ధం చేసే దిశగా గత దశాబ్దం పైగా ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో తీవ్ర కృషి జరుగుతుంది. తమకు అనేక శుభాలు అనుగ్రహిస్తున్న శ్రీ అమ్మవారి కోసం దేశవిదేశాల నుండి సైతం దాతలు, భక్తులు విరాళాలు విరివిరిగా అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికే 72 కిలోల పైగా బంగారం సమకూరగా, వాటిలో 51 కేజీల బంగారు ఆభరణాలు వస్తువులు గర్భాలయంలో అమర్చారు. ఇంకా 13 కిలోలతో కొత్త బంగారు నగల తయారీకి ధర్మాదాయ శాఖ అనుమతి లభించింది. భక్తులు సమర్పించిన వెండి కానుకలతో 351 కిలోల 179 గ్రాముల 871మిల్లి గ్రాములు ఆలయంలో అలంకరణలు, వస్తువులకు వినియోగించారు. శ్రీ అమ్మవారిని పూర్తీ స్వర్ణమయం అలంకరణ చెయ్యడానికి ప్రస్తుత ధర్మకర్తల మండలి సభ్యులు మరియు చైర్మెన్ మానేపల్లి నాగన్న బాబు, దేవాలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ ఆధ్వర్యంలో కృషి కొనసాగుతుంది. భక్తుల సహకారంతో త్వరలో ఈ స్వర్ణలక్ష్యం నెరవేరుతుందని కోరుకొందాం.. ఇక్కడ నిత్యాన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు మహా ప్రసాద వితరణ దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. అయితే విశాలమైన హాలు ఏర్పాటు చేసి అన్నసమారాధన లో విశేషంగా భక్తులు పాల్గొనే అవకాశం కల్పించవలసిన బాధ్యత ఉంది.
