సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంగన్వాడీ మహిళలు సమ్మె ను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడం, పిల్లల సంరక్షణార్థం అంటూ అంగన్వాడీల కేంద్రాల తాళాలు బద్దలు కొట్టి బలవంతంగా తెరిపించడం , బెదిరింపులు చేయడం, కాదు దమ్ముంటే మమ్మల్ని అరెస్టు చేయండి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఇచ్చిన జైలు భరో కార్యక్రమం భీమవరంలో విజయవంతంగా జరిగింది. భీమవరంలో కొత్త బస్టాండ్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రకాశం చౌకు చేరి అక్కడినుంచి ఆర్డిఓ ఆఫీస్ కు వెళ్లి ముట్టడించారు. అధికారులను ఆఫీసులో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకున్నారు. అక్కడి నుంచి తాలూకా ఆఫీస్ సెంటర్లో రోడ్డుపై బెటాయించారు. తరువాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు బెటాయించారు. పోలీసులు వీరిని ర్యాలీ ని బైకులపై ఎటువంటి ఉద్రిక్తలు తలెత్తకుండా ముందుచూపుతో అనుసరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జేఎన్వి గోపాలన్, కే రాజా రామ్మోహన్ రాయ్ మాట్లాడుతూ మహిళలనేది కూడా చూడకుండా గత 29 రోజులుగా అంగన్వాడీలను నడిరోడ్డు మీద నిలబెట్టిన ప్రభుత్వం బరితెగించి మొండిగా పనిచేస్తుందని ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పక తప్పదు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యను, మున్సిపల్ కార్మికుల సమస్యలను, సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఎఐసిటియు మున్సిపల్ కార్మికులు, బజారు జట్టు కార్మికులు, రైస్ మిల్ కార్మికులు, అంగన్వాడి, ఆశ, వివో ఏ, సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు, తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.
