సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం 2వ రోజు ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. నేటి ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి సభలో ఉన్న కొద్దిమంది టీడీపీ సభ్యులు తమ నిరసనలతో హోరెత్తించారు. నిత్యావసర వస్తువుల ధరలపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టగా అందుకు స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. వెంటనే స్పీకర్ టీ బ్రేక్ ఇచ్చారు. టీ బ్రేక్ అనంతరం సభ పున:ప్రారంభమవగా..మళ్ళీ వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. సైకో పోవాలి… సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. మళ్ళీ స్పీకర్ పోడియంపైకి వెళ్లి టీడీపీ సభ్యులు. స్పీకర్ పైకి పేపర్లు చించి వేసి విసిరేశారు. దీనితో ఆగ్రహం చెందిన స్పీకర్ వారిని ఈరోజు సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సస్పెండ్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లకపోవడంతో వెంటనే వెళ్ళాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. మార్షల్స్ వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు తీసుకెళ్లారు. ఈలలు వేసుకుంటూనే టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లారు.ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, భవానీ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, వీరాంజనేయస్వామిలను సభ నుంచి సస్పెండ్ చేశారు.
