సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని కోనూరులో ఏపీ ప్రభుత్వం నేడు, గురువారం నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రులు, రాజమౌళి, కీరవాణి వంటి ఎందరో ప్రముఖులు పాల్గొని రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు ఓ అక్షర శిఖరమని పేర్కొని ఘన నివాళ్లు అర్పించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. . అచంచలమైన విశ్వాసంతో ఎదిగిన వ్యక్తి రామోజీరావు ఇచ్చిన స్ఫూర్తిని ముందు తరాలకు అందించాలని సూచించారు. ఒకే ఒక ఎన్టీఆర్.. ఒకే ఒక రామోజీరావు ఉంటారన్నారు. వారాహి అమ్మవారి 11 రోజుల దీక్షలో ఉన్నడిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. . తాను చూసిన రామోజీరావులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని, 2008లో నేరుగా ఒకసారి రామోజీరావును కలిసి మాట్లాడానని గుర్తుచేసుకున్నారు. ‘‘రామోజీరావు ప్రజల పక్షపాతి… జర్నలిస్టు విలువను కాపాడటంలో ముందున్నారు. ప్రజల కోసం ఏం చేయాలనే అంశాలపైనే ఆలోచించారు. 2019లో నన్ను లంచ్ మీటింగ్‌కు రామోజీరావు ఆహ్వానించారు. దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు, పత్రికా రంగం గురించి మా మధ్య చర్చ సాగింది’’ అని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. అటువంటి వ్యక్తిని గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసునని, పేపర్ ఒక్కటే నడపటం చాలా కష్ట సాధ్యం.. కానీ విలువలతో ముందుకు సాగారని ప్రశంసించారు. ఇతర వ్యాపారాలపై దాడులు చేసినా తట్టుకుని జర్నలిస్టుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు సాగారని గుర్తుచేశారు.‘‘ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో కూటమి విజయ వార్త విన్నారా లేదా? అని నేను కూడా అడిగి తెలుసుకున్నాను. అయన కోరుకొన్న విజయ వార్త విన్న తర్వాతే ఆయన తన ప్రాణాలు విడిచారు. అటువంటి మహోన్నత వ్యక్తి విగ్రహం అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. అని అన్నారు.
