సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక కార్పొరేట్ పదవులు దక్కక పోయిన తమ గౌరవానికి భంగం కలగని రీతిలో ప్రముఖ దేవాలయాల ధర్మ కర్తల మండలి లో పదవుల కోసం గత ఏడాదిగా నిరీక్షిస్తున్న వారికీ శుభవార్త వచ్చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని 129 దేవాలయాలలో ధర్మకర్తలమండలి నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత దేవాలయాలకు అర్హులైన వారు నోటిఫికేషన్ జారీచేసిన 20 రోజుల్లో దరఖాస్తులు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తులను పరిశీలించి సభ్యుల నియామక ఉత్తర్వులు జారీ కానున్నాయి. ( నిజానికి స్థానిక ఎమ్మెల్యే ల సిఫార్స్ ల ప్రమేయం తోనే జరుగుతుంది.) భీమవరం పట్టణం పరిధిలో ..తెలుగునాట ప్రాచుర్యం పొందిన శ్రీ మావుళ్ళమ్మ,శ్రీ పంచా రామం సోమేశ్వరస్వామి ఆలయాలతోపాటు గునుపూడి ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి, పోలేరమ్మ, శ్రీరాంపురం రామలింగేశ్వరస్వామి, మారుతి సెంటర్ లోని శ్రీ దాసాంజనేయస్వామి,శ్రీ ఉమా భీమేశ్వరస్వామి, డి ఎన్ ఆర్ దగ్గర లోని శ్రీ దుర్గాలక్ష్మి యనమదుర్రు స్వయం భూ శ్రీ శక్తీశ్వరస్వామి,ఆలయాలకు ఉత్తర్వులు వచ్చాయి. అయితే జువ్వలపాలెం రోడ్డులోని శ్రీ పద్మావతి వేంకటేశ్వరస్వామి దేవస్థానంకు ఉత్తర్వులు రాకపోవడం గమనార్హం.
