సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నరసయ్య అగ్రహారంలో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు, డివైడర్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అధికారులను ఆదేశించారు. నేడు, సోమవారం సాయంత్రం భీమవరం మున్సిపాలిటీ ఐదవ వార్డు కుముదవల్లి రోడ్డులో ఆర్టీసీ డిపో అవుట్ గేట్ కార్నర్ నుంచి దుర్గా కర్రీ పాయింట్ వరకు మూడు కోట్ల రెండు లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పరిశీలించారు. ప్రస్తుతం ఆరు మీటర్లు ఉన్న రోడ్డును 11 మీటర్లు సిమెంట్ రోడ్డుగా వెడల్పు చేసే పనులు వేగంగా సాగుతున్నాయని, ఎలక్ట్రికల్ స్తంభాలు అడ్డంగా ఉండటం వల్ల పనులు కొద్దిగా ఆలస్యం అవుతున్నాయని మున్సిపల్ ఇంజనీర్ త్రినాధరావు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ కు వివరించారు. రోడ్డు నిర్మాణానికి ఎలక్ట్రికల్ స్తంభాలు అడ్డు లేకుండా 15 రోజులలో మార్చాలని ఎలక్ట్రికల్ అధికారులను మంత్రి ఆదేశించారు. మున్సిపల్, ఎలక్ట్రికల్ అధికారులు సమన్వయంతో పనిచేసి కాంట్రాక్టర్ తో వర్షాకాలం ప్రారంభమయ్యేలోపే నిర్మాణం పనులు పూర్తి అయ్యేలా చూడాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కోరారు.
