సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో పలు ప్రాంతాల్లో గత 10 రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీమవరంలో ప్రతి రోజు వరుసగా వర్షం పడుతూనే ఉంది. అయితే, రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ విభాగం (ఐఎండీ) తెలిపింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ నేడు శుక్రవారం సాయంత్రానికి బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో తీవ్ర వాయుగుండంగా, ఆ తరువాత తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు.. ఈనెల 27 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ కారణంగా ఈనెల 26, 27 తేదీల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. రేపు శనివారం గోదావరి జిల్లాలు , అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, సత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిలాల్లోనూ భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
