సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశములోని సామాన్య ప్రయాణికులకు వందేభారత్ తరహా ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ‘అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు’ ( కాషాయం రంగులో) తెలుగు రాష్ట్రాల మీదుగా కూడా మరో సర్వీసు ను అందించనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లోని చర్లపల్లి- ముజఫర్‌పూర్ (బిహార్) మధ్య ఒక అమృత్ భారత్ సవలందిస్తుండగా, వచ్చే జనవరి 27నుంచి ప్రారంభం కానున్న తిరువనంతపురం- చర్లపల్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్ తెలంగాణకు రెండోది కావడం గమనార్హం. ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 2.45 నిమిషాలకు తిరువనంతపురం చేరుకుంటుంది. తిరిగి బుధవారం సాయంత్రం తిరువనంతపురంలో మొదలై, గురువారం రాత్రి 11.30 గంటలకు చర్లపల్లికి చేరుకోనుంది. తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ.. ఏపీలోని సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటల మీదుగా రైలు ప్రయాణిస్తుంది. ప్రయాణికులు శుక్రవారం నుంచి రైల్‌వన్ యాప్ లేదా టికెట్ కౌంటర్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ రైలులో 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 11 జనరల్ సెకండ్ క్లాస్, 2 దివ్యాంగుల కోచ్‌లతో పాటు ఒక ప్యాంట్రీకార్ ఉంటాయి.
