సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ స్థానంలో రఘురామా కృష్ణంరాజు సభ నిర్వహిస్తునప్పుడు భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడాతూ.. . కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులు చాలా సంతోషంగా ఉన్నారని, ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు ధాన్యం డబ్బులు 24 గంటల లోపే చెల్లింపులు జరుగుతున్నాయని గత ప్రభుత్వం సమయంలో రైతులు తమ డబ్బులు పొందడానికి 3 నెలల వరకు వేచి చూడాల్సి వచ్చేదని, ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ఇప్పటి వరకు సుమారు 46 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయబడిందని దీని వల్ల రైతులు చాలా సంతృప్తిగా ఉన్నారన్నారు. అయితే కూలీ ఛార్జీలు, రవాణా ఛార్జీలు రైతులకు వెంటనే చెల్లించడం లేదని, ఇంకా 2021 రవాణా రేట్లనే చెల్లిస్తున్నారని, ధరలు పెరగడంతో రైతులు అదనపు ఖర్చు చేస్తున్నారని, కాబట్టి అసలు రవాణా కూలీ ఛార్జీలను ధాన్యం డబ్బులతో పాటు రైతుల ఖాతాల్లోకి నేరుగా చెల్లించాలని, కమిషన్ ఏజెంట్లకు చెల్లించవద్దన్నారు. మిల్లింగ్ ఒప్పందం ప్రకారం మిల్లర్లకు చెల్లించాల్సిన మిల్లింగ్ ఛార్జీలు, సార్టెక్స్ ఛార్జీలు, బియ్యం రవాణా ఛార్జీలు, ఎఫ్ఆర్ కే బ్లెండింగ్ ఛార్జీలు, గన్నీ యూజర్ ఛార్జీలు, డ్రయేజ్ ఛార్జీలు 15 రోజుల్లోపు చెల్లించాలని, ఆలస్యంగా చెల్లించడం వల్ల మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం పీడీఎస్ ద్వారా 15 శాతం బ్రోకెన్స్ బియ్యం ఇస్తున్నారని, వచ్చే రబీ సీజన్ నుంచి 10 శాతం బ్రోకెన్స్ బియ్యం ఇవ్వాలని కోరుతున్నానని, కేంద్ర ప్రభుత్వం కూడా 10 శాతం బ్రోకెన్స్ పై సానుకూలంగా ఉందన్నారు. కాబట్టి కేంద్ర అనుమతి తీసుకొని ఏప్రిల్ 1 నుంచి 10 శాతం బ్రోకెన్స్ పీడీఎస్ అమలు చేయాలని కోరుతున్నానని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు.
