సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల భారత దేశ వ్యాప్తంగా కేంద్ర పని తీరును ప్రశ్నించడానికి యువతలో పెను సంచలనం సృష్టించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వెబ్సైట్ మూతపడింది. అంతేకాదు, సీజేపీ పేరుతో ప్రారంభించిన సోషల్ మీడియా హ్యాండిళ్లన్నింటినీ హ్యాక్ చేశారని, అవి తమ నియంత్రణలో లేవని పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే శనివారం ఎక్స్‌లోని తన వ్యక్తిగత హ్యాండిల్ (@abhijeet_dipke)లో ప్రకటించారు. తన వ్యక్తిగత ఇన్స్టాగ్రాం ఎకౌంట్ కూడా హ్యాక్ అయ్యిందన్నారు. ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నాకారణంగా ‘నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్ పిటిషన్ల ఉద్యమం ప్రారంభించిన మరుసటి రోజే వెబ్‌సైట్‌ను నిలిపివేయటమేగాక మా ఎకౌంట్లను హ్యాక్ చేశారు. జవాబుదారీతనాన్ని కోరుతున్న మా పార్టీ మీద చర్యలు తీసుకున్నారు.బొద్దింకలంటే ప్రభుత్వానికి ఎందుకంత భయం? నవ భారత్ అంటే ఇదేనా’ అని అభిజిత్ ప్రశ్నించారు. వైబ్ సైట్ నిలిపివేయడానికి , ముందు అభిజిత్ ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో విడుదల చేశారు. ‘సీజేపీ ఎటువంటి నిరసనలకు పిలుపు ఇవ్వలేదు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే మొత్తం ఉద్యమం మీదే దుష్ప్రచారం చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. కాబట్టి, కాక్రోచ్లందరూ శాంతియుతంగా, జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. కాగా, సీజేపీ ఎక్స్ హ్యాండిల్‌ను ఇంతకుముందే నిలిపివేసిన నేపథ్యంలో ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ అనే హ్యాండిల్‌ను ఆ పార్టీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇది ప్రస్తుతం కొనసాగుతోంది. దీని ఫాలోయర్ల సంఖ్య 20 లక్షలు దాటింది. సీజేపీ ఇన్‌స్టాగ్రాంలో ప్రస్తుతానికి 2 కోట్ల 22 లక్షల మంది ఫాలోయర్లున్నారు.
