సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను ఆదుకోడానికి యుద్ద ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కనీస మద్దతు ధర ప్రకటిచి వారిని ఆదుకోవాలని, రైతులను దోచుకొంటున్న సిండికేట్ లను నిర్ములించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతుల పక్షాన పెను ఉద్యమాలు నిర్మిస్తామని, జి.ఓ.169 ఆక్వా రైతాంగానికి గుదిబండగా ఉందని, హేచరీలపై నియంత్రణ లేదని ఒక లక్షల సీడ్ వేస్తే 50వేలు కూడా బతకడం లేదని, వైట్ గట్ వైరస్ కుంగదీస్తుందని, మరో పక్క సీడ్, ఫీడ్, పెట్రో, డీజిల్ పెరిగి సాగు కష్టంగా మారిందని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, గిట్టుబాటు ధరల లేమి, మేత ధరల పెరుగుదల,విద్యుత్ ఛార్జీల భారం తదితర సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శులు పి.జమలయ్య, డేగా ప్రభాకర్ అధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం భీమవరం మండలంలోని లోసరి, నాగిడిపాలెం గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ప్రతినిధి బృందం ఆక్వా రైతులను నేరుగా కలిసి సాగు వ్యయం, ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, మేత ధరల పెరుగుదల, విద్యుత్ ఛార్జీలు, మార్కెటింగ్ తదితర ఇబ్బందులు అడిగి తెలుసుకొన్నారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని ప్రతినిధి బృందం ఆక్వా రైతులకు హామీ ఇచ్చింది.
