సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం భీమవరం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో భీమవరం నియోజకవర్గ స్థాయి ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను ఎమ్మెల్యే అంజిబాబు, జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ లు స్వయంగా స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ వారం 32 అర్జీలను స్వీకరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. ఒకసారి వచ్చిన అర్జీని నాణ్యతతో పరిష్కరించడం ద్వారా అదే అర్జీదారుడు మళ్లీ మళ్లీ అదే సమస్యపై ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా చూడటమే ప్రత్యేక పీజీఆర్ఎస్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా జూన్ 12న భీమవరంలో 113 అర్జీలు, జూలై 3న చిన అమీరంలో 34, 10న వీరవాసరంలో 150, 17న భీమవరంలో జరిగిన పీజీఆర్ఎస్ లో 32 అర్జీలతో కలిపి మొత్తం నాలుగు వారాల్లో 329 అర్జీలను అందించారని అన్నారు. ఇళ్ల స్థలాలు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు, ఉపాధి అవకాశాలు, రేషన్ కార్డులు, భూమి రీ-సర్వే, తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, రోడ్ల మరమ్మతులు తదితర అంశాలకు సంబంధించిన అర్జీలు అధికంగా వచ్చినట్లు తెలిపారు. అర్జీలను పరిశీలించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ముగింపు చేయరాదని అధికారులకు సూచించారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
