సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో రాజకీయాలను నిర్ణయించే కీలకమైన శక్తివంతమైన రాజకీయ నేతలు ఉన్న భీమవరం పట్టణంతో సహా…ఇంకా ఎన్నికలు జరగని మిగిలిన మున్సిపాలిటీలకు ఎన్నికలకు సంబంధించి దీపావళి పండుగ తరువాత కొత్త నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నెల 25లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తుంది. భీమవరం పట్టణంలో 8 న్నర ఏళ్ళు తరువాత జరుగుతున్నా మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ లేదా ‘జనసేన’ తరపున ఓసీ మహిళా కేటగిరిలో పోటీ చేసేందుకు ఉన్నత కుటుంబాలకు చెందిన ‘రాజకీయాలకు కొత్త’ అయిన 5గురు మహిళా అభ్యర్థులు వరకు పోటీ పడుతూ.. తమ అభ్యర్థనలను ఇప్పటికే కూటమి పెద్దల ముందు ఉంచుతున్నారు. అయితే వీరిలో ఆర్ధికంగా చాల బలమైన అభ్యర్ధికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని కూటమి పెద్దలు భావిస్తున్నట్లు ప్రస్తుత సమాచారం. అలాగే మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాజకీయాలకు దూరం అయ్యాక జిల్లా లోనే ఆ స్థాయి మాస్ లీడర్ లేక డీలా పడ్డ వైసీపీ తరపున కూడా గుంభనంగా ఆర్ధికంగా బలంగా ఉన్న అభ్యర్థిని పోటీకి దింపితే ‘మంచి ఫలితం’ సాధించవచ్చునని భావిస్తున్నారు. అయితే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కొర్పొరేషన్లు.. 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లతో పాటుగా మిగిలిన అన్ని ప్రక్రియలు పూర్తి చేశారు.. ఈ నెల10 నుంచి 12 మధ్య ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం, తాడేపల్లిగూడెం, చింతలపూడి, పాలకొల్లు, తణుకు పట్టణాలలో ఎన్నికలు జరగవలసి ఉంది.
