సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ సమగ్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం కలిగిన స్థానిక పాలన అవసరమని, మున్సిపాలిటీలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులకు మరింత వేగం చేకూరుతుందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. భీమవరం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చైర్ పర్సన్ అభ్యర్థి చుండూరి తో పాటు త్రీ టౌన్‌లోని 3, 4, 5 వార్డుల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భీమవరం త్రీ టౌన్ ప్రాంతాన్ని రాబోయే ఏడాది కాలంలో అభివృద్ధికి ఆదర్శంగా నిలిచే హబ్‌గా మారుస్తామని బైపాస్ రహదారిని సెంట్రల్ లైటింగ్‌తో కూడిన నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరయ్యాయని, ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిన టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. బైపాస్ రహదారిలో రైల్వే గేట్ల వద్ద తరచూ ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా రైల్వే ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వన్ టౌన్ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించి, పట్టణంలోని వివిధ ప్రాంతాలకు సులభమైన కనెక్టివిటీ కల్పించేలా రహదారి అభివృద్ధి పనులు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో 3వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిని గాదిరాజు కృష్ణవేణి, 5వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిని నడింపల్లి సౌజన్య, 4వ వార్డు కౌన్సిలర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రకాష్ పాటు ఏఎంసీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, ఆరేటి ప్రకాష్, కూటమి క్యాడర్ పాల్గొన్నారు.
