సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిపై తెలుగు సినీ పరిశ్రమతో పాటు , ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం అలముకొంది. ఆఖరి వీడ్కోలు కు ఇక్కడ నుండి ఎందరో నేడు, సోమవారం హైదరాబాద్ తరలి వెళ్లారు. ఆయన స్వగ్రామం మొగల్తూరు లో స్వచ్చందంగా దుకాణాలు మూసివేశారు. ఇక పలువురు టాలీవుడ్ ప్రముఖలంతా తమ సంతాపాన్ని తెలియజేశారు. అయితే టాలీవుడ్ ప్రముఖుల ప్రవర్తనపై సోషల్ మీడియా వేదికగా ‘మేడ్ ఇన్ భీమవరం’ రాంగోపాల్ వర్మ తీవ్ర స్థాయిలో స్పందించాడు. వర్మ చేసిన ట్వీట్‌లో.. ‘భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!. కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి, మోహన్‌బాబుగారికి, బాలయ్యకి, ప్రభాస్ కి, మహేష్, కల్యాణ్‌కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.మనసు లేకపోయినా ఓకే. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది. మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం’ అని వరుసగా ట్వీట్స్ చేశాడు. అంతేకాకుండా.. ఆ పోస్టుకి టాలీవుడ్ టాప్ స్టార్స్‌ని ట్యాగ్ కూడా చేశాడు.
