సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవన్ కళ్యాణ్ నేడు, వైసిపి నేతలపై వాడిన బూతుల పంచాంగం కు రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నేతలు, తీవ్ర పదజాలంతో పవన్ కు హెచ్చరికలు చేస్తూన్నా నేపథ్యంలో గతంలో పవన్ కళ్యాణ్ ఫై భీమవరం నుండి ఘనవిజయం సాధించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేటి సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజా పాలనా అందిస్తున్న జగన్ సర్కార్ గురించి పవన్ కళ్యాణ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. దివంగత వంగవీటి మోహనరంగా కోసం మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కి లేదని ,వంగవీటి మోహన్ రంగా ను చంపించిన చంద్రబాబుకు నువ్వు మద్దతిస్తూ ఆయన దత్తపుత్రుడుగా ఉన్నావని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో పోలీస్ దౌర్జన్యాలతో ముద్రగడ కుటుంబానికి జరిగిన ఘోర అవమానంతో సహా అసలు కాపుల గురించి ఎప్పడు పట్టించుకోని, పవన్ కళ్యాణ్ తన స్వంత ప్రయోజనాలకోసం కాపు ఎమ్మెల్యేల కోసం మాట్లాడటం నీకు తగదని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఓటు వేస్తేనే కాపు ఎమ్మెల్యేలు గెలిచారని, కానీ నువ్వు చంద్రబాబు చెప్పినట్లు రాజకీయాల్లో నడుస్తున్నావని ఎద్దేవా చేశారు. నేడు పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టుడు ప్రవర్తన కారణంగా కాపు యువత భవిష్యత్తును కోల్పోతుందని ఆందోళన కరంగా ఉందని తెలిపారు. చంద్రబాబుకు అధికారం కట్టబెట్టడానికి ‘ప్యాకేజీ స్టార్”గా మారిన పవన్ కళ్యాణ్ సమాజంలో విధ్వంసం సృష్టించే విధంగా వ్యవహరిస్తున్నారని, నీ జనసేన అభిమానులను టీడీపీ కి బానిసలుగా మారుస్తున్నావని ఆరోపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ యువతను దృష్టిలో పెట్టుకుని ప్రసంగాలు చేస్తున్నారని, ఆ ప్రసంగాల వల్ల యువత సమాజంలో పెడదారి పట్టి అవకాశం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ ముఖ్యంగా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన జనసైనికులు తాలి బన్ ల ను మించిపోయారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరులో డీమార్ట్ ను దోచేసారని, విశాఖపట్నంలో ఒక సినిమా ధియేటర్ ను ధ్వంసం చేశారని, రెండు రోజుల కిందట విశాఖపట్నంలో మంత్రుల కార్లపై దాడి చేసే స్థాయికి కూడా జనసైనికులు చేరుకున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇటు భీమవరం అటు గాజువాక నుండి పోటీ చేసి రెండు చోట్ల కూడా అపజయం పొందారని ఆనాడే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ఇక్కడి ప్రజలు ముందుగానే గుర్తించారని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కి దమ్ముంటే 2024 ఎన్నికల్లో సింగల్ గా పోటీ చేయాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సవాల్ విసిరారు.
