సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ మరో సాహసోపేతమైన అడుగువేస్తుంది. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు , భూ రక్షా పథకం ’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నగరాలలో, పట్టణ ఆస్తుల సమగ్ర భూ హక్కు సర్వే పనులను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ వేగవంతం చేసింది. నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆయా నగరపాలక, పురపాలక సంస్థల పరిధిలోని ఆస్తుల హక్కు దారులకు నోటీసులు జారీచేయాలని ఉన్న తాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతమున్న రికార్డుల ప్రకారం ఆస్తులు, వాటి యజమానుల గుర్తింపు ప్రకారం మొత్తం 123 స్థానిక సంస్థల్లో ( పురపాలక సంఘాలు )లో 38 లక్షల ఆస్తులున్నాయని, సర్వే లో మరో పది శాతం పైగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ప్రజల ఆస్తులు నిర్ధారణ తో పాటు ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం కూడా పెరుగుతుంది, కబ్జాలకు ఆస్కారం ఉండదు. అలాగే అన్యాక్రాంతమైన భూముల ఆస్తుల వివరాలు తెలుస్తాయి.సర్వే తరువాత సరిహద్దులను గుర్తించి హక్కుదారుకు సమగ్రమైన వివరాలతో కూడిన హక్కు పత్రం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 20 వేల మంది వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలతో పాటు ఇతర మున్సిపల్ సిబ్బందికి మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇప్పించారు. ప్రతి వార్డుకి ఐదుగురు సర్వే సిబ్బంది ఉండేలా చర్య లు తీసుకున్నారు.
