సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నంతలో మంచి కేటాయింపులు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి కి ఈ ఏడాది రూ. 15 వేల కోట్లు సమకూర్చడానికి కేంద్రం అంగీకరించింది. కానీ అది వివిద సంస్థల నుండి రుణాల రూపంలో కావడం బాధాకరం. పోలవరం ప్రాజెక్టు పూర్తీ చెయ్యడానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని మరోసారి హామీ ఇచ్చారు. ఇక ప్రత్యేక హోదా అంశం మాత్రం మాటమాత్రం గా కూడా ఎత్తలేదు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాల ప్రకారం మరి ఏపీకి వచ్చే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం..విదేశీ సంస్థల సాయంతో అమలయ్యే పలు ప్రాజెక్టులు కింద ఏపీకి నిధులు అందించనున్నారు. పల్లెలు పట్టణాలలో రోడ్ల నిర్మాణానికి నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ద్వారా వివిధ ప్రాజెక్టుల కింద ఏపీకి సాయం అందించనున్నారు. కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వచ్చే వాటాలోనూ పెరుగుదల ఉంది. 2024-25 కేంద్రం పన్నుల్లో ఏపీ పన్నుల వాటా రూ. 50,474 కోట్లు రానుంది. ఇదే సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి రూ. 620 కోట్లు కేటాయించింది . విశాఖ-చెన్నై-ఓర్వకల్లు-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌కు నిధులు కేటాయిస్తామన్నారు. పూర్వోదయ పథకం కింద ఏపీకి మరింత సాయం అందిస్తామన్నారు. రాష్ట్రంలో రొయ్యల పెంపకం, మార్కెటింగ్ కోసం ఆర్థిక సహాయం పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి బడ్జెట్ కేటాయింపులపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేసారు.
