సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ నేడు, శనివారం కోపల్లె 4 లేన్ల నూతన వంతెన నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు శాఖా మంత్రి బిసి జనార్దన్ రెడ్డి తో కలిసి శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే, రఘురామ కృష్ణంరాజు శంకుస్థాపన చేశారు. ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం కోపల్లె గ్రామం వద్ద భీమవరం-గుడివాడ రాష్ట్రీయ రహదారిపై శిథిలావస్థకు చేరుకున్న బ్రిటిష్ కాలం నాటి పాత వంతెన స్థానంలో ఈ కొత్త వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 12 కోట్లు మంజూరు చేయడం జరిగింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తమ కల సాకారం అవుతున్న ఈ శుభ సందర్భంలో, ఉండి నియోజకవర్గ ప్రజలు ఉత్సాహభరితంగా, ఆనందోత్సాహాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, పాలకోడేరు సహకార బ్యాంకు చైర్మెన్ కొత్తపల్లి నాగరాజు పలువురు ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
