సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం విద్యాచరిత్రలో విష్ణు విమెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు ఒక సువర్ణాధ్యాయమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. గత 25 ఏళ్లుగా మహిళలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ వేలాది మంది విద్యార్థినుల భవిష్యత్తుకు బాటలు వేసిన శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి ప్రైవేట్ మహిళా విశ్వవిద్యాలయంగా ‘విష్ణు విమెన్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని, యూనివర్సిటీ హోదా సాధించడంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ ఉన్నాయని పేర్కొన్నారు. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, డాక్టర్ బి.వి. రాజు ఫౌండేషన్ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నేడు ఆదివారం రాత్రి భీమవరంలోని విష్ణు క్యాంపస్‌లో ‘విష్ణు కాన్‌ఫ్లుయెన్స్ – మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు మహిళ యూనివర్సిటీ గా అనుమతులు సాధించేందుకు విశేషంగా కృషిచేసిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మను చైర్మన్ విష్ణు రాజు ఘనంగా సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి లోకేష్ సహకారంతో యూనివర్సిటీ సాకారమైందని ఆయన అన్నారు. అలాగే విష్ణు కాలేజీ ల అబివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ప్రస్తుత ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ కూడా సహకారం అందించారని అన్నారు. ఈ మహిళా యూనివర్సిటీని భవిష్యత్తులో అత్యుత్తమ ప్రమాణాలతో విదేశాల నుండి సైతం వచ్చి చదువుకునేలా రూపుదిద్దుతామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబమంతా అభివృద్ధి చెందుతుందనే దృఢ సంకల్పంతో పద్మభూషణ్ డాక్టర్ బి.వి. రాజు మహిళా విద్యాసంస్థలకు పునాది వేశారని గుర్తుచేశారు. ఆయన దూరదృష్టితో ప్రారంభమైన విద్యా ప్రస్థానం నేడు తెలుగు రాష్ట్రాల నుండి ప్రతి రోజు 9 వేల మంది చదువు కోసం వస్తున్నారని, ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థినులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించే స్థాయికి చేరుకోవడం సంతోషకరమన్నారు. చైర్మన్ కె.వి. విష్ణు రాజును, ప్రసాద్ రాజును, రమేష్ తో పాటు ఇతర నిర్వహణ సిబ్బంది, అధ్యాపక స్టాఫ్ ను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *