సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ రేపు, సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలానికి ఈ నెల 24వ తేదీన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ రానున్నారు. ముందుగా విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ లో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు. ముసునూరు గ్రామంలోని గౌర్మేట్ పాప్ కార్నిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పాప్ కార్న్ సీడ్‌ను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆవిష్కరించనున్నారు. పాప్ కార్న్ ఉత్పత్తికి కృషి చేస్తున్న మొక్కజొన్న రైతులను ఉపరాష్ట్రపతి సన్మానించనున్నారు. ఇంకా పశ్చిమ గోదావరి జిల్లాలో రాధాకృష్ణన్ పర్యటించే ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
