సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో .. రేపు (సెప్టెంబర్ 11) దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. UFBU సమ్మె వల్ల ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. శుక్రవారం సమ్మె జరగనుండగా, ఆ తర్వాతి రెండు రోజులు (శని, ఆదివారాలు) బ్యాంకులకు సాధారణ సెలవులు. అలాగే సెప్టెంబర్ 14న వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, చెన్నై తదితర ప్రాంతాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో బ్యాంకు ఖాతాదారులకు వరుసగా 4 రోజుల పాటు బ్యాంకింగ్ లావాదేవీలపై ప్రభావం పడనుంది. రేపటి సమ్మెతో తమ డిమాండ్లు నెరవేరకపోతే సెప్టెంబర్ 28 నుంచి 3 రోజుల పాటు దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తామని, అలాగే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని యూనియన్లు హెచ్చరించాయి.
